: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకాడేది లేదు: చంద్రబాబు నాయుడు
రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వెనకాడేది లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కొందరు కులం, మతం పేరుతో రెచ్చగొట్టాలని చూస్తున్నారని, మరోవైపు రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతున్నారని అన్నారు. అటువంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు లబ్ధి చేకూర్చే ముచ్చుమర్రి (కర్నూలు జిల్లా) ఎత్తిపోతల పథకాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు తనపై నమ్మకం ఉంచారని, వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. తాము రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించామని చెప్పారు. రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని అన్నారు. జలసిరి కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కోరారు. భూగర్భ జలాలను పెంచాలని పిలుపునిచ్చారు.