: శిల్పాశెట్టి ఫోటోలు తీసినందుకు రక్తమొచ్చేలా కొట్టారు... వీడియో చూడండి
బాలీవుడ్ వెటరన్ హీరోయిన్ శిల్పాశెట్టి ఫోటోలు తీసిన జర్నలిస్టులను బౌన్సర్లు రక్తమొచ్చేలా కొట్టిన ఘటన వీడియోకు ఎక్కి వైరల్ అవుతోంది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న బస్టైన్ హోటల్ వద్ద గత అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, హోటల్ కు వచ్చిన శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు బయటకు వెళ్లే సమయంలో జర్నలిస్టులు, అక్కడున్న ఇతరులు తమ వద్ద ఉన్న కెమెరాలు, సెల్ ఫోన్లకు పనిచెప్పారు. శిల్పా, రాజ్ లు సైతం ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోయారు.
వారు అలా కారు ఎక్కగానే, ఇలా హోటల్ బౌన్సర్లు దాడికి దిగి, దొరికిన వారిని దొరికినట్టు బాదేశారు. ఈ ఘటనలో సోను, హిమాన్షు షిండే అనే ఫోటో జర్నలిస్టులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు తమ సెల్ ఫోన్లలో వీడియో తీయగా, ఇప్పుడది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. హోటల్ బౌన్సర్ల దాడిపై జర్నలిస్టులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వీడియోను వార్తా సంస్థ 'ఏఎన్ఐ' షేర్ చేసింది. దాన్ని మీరూ చూడవచ్చు.