: 70 అడుగుల సెల్ టవర్ ఎక్కి కాకిని కాపాడిన హోంగార్డు... మీరూ చూడండి!
ప్రాణాపాయంలో ఉన్న ఓ కాకిని రక్షించడానికి ఓ హోంగార్డు 70 ఆడుగుల టవర్‌పైకి ఎక్కిన ఘటన హైదరాబాద్‌లోని మాదన్నపేటలో చోటు చేసుకుంది. టవర్‌పై దారానికి చిక్కుకుని విలవిలలాడుతోన్న కాకిని గమనించిన ఓ వ్యక్తి 100 నెంబరుకు కాల్ చేసి చెప్పాడు. దీంతో వారు మాదన్నపేట పోలీసుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొచ్చారు. దీంతో అక్కడికి పోలీసు పెట్రోలింగ్ వాహనం చేరుకుంది.
ఆ వాహనానికి డ్రైవర్‌గా పనిచేస్తోన్న హోంగార్డు కృష్ణ... ఆ టవర్ పైకి ఎక్కి కాకిని కాపాడడం తన డ్యూటీ కాకపోయినప్పటికీ దాన్ని ఎక్కి 45 నిమిషాలు కష్టపడి ఆ కాకిని రక్షించాడు. అనంతరం కృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. టవర్ ఎక్కిన వెంటనే తాను కాకికి చుట్టుకున్న దారాన్ని కట్ చేశానని చెప్పాడు. దీంతో ఆ కాకి ఎగిరిపోయి, దాని కోసం ఎదురుచూస్తూ ఉన్న మరికొన్ని కాకుల గుంపులో అది కలిసిపోయిందని చెప్పాడు. మాదన్నపేట్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఆ హోంగార్డుతో పాటు 100 నెంబర్‌కి ఫోన్ చేసిన వ్యక్తిని అభినందించారు.