: జర్నలిస్టుల హత్యల వెనుక పెద్ద కుట్ర ఉంది: మాయావతి
జర్నలిస్టు, హేతువాది గౌరీ లంకేశ్ హత్యపై బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ఆందోళన వ్యక్తం చేశారు. బెంగళూరులో గౌరీ లంకేశ్ హత్యకు గురైన తీరు చూస్తోంటే దీని వెనుక పెద్ద కుట్రే ఉందని అర్థమవుతోందని అన్నారు. ఈ హత్యపై కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏ విచారణకు ఆదేశించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే గతంలో ఇదే రీతిలో హత్యకు గురైన నరేంద్ర దబోల్కర్, గోవింద్ పన్సారే, ఎంఎం కల్బర్గీల హత్యలపై కూడా ఎన్ఐఏతో విచారణ జరిపించాలని అన్నారు. కొద్ది కాల వ్యవధిలోనే జర్నలిస్టులు వరుసగా హత్యలకు గురవుతున్నారని, ఈ హత్యలను కేంద్ర ప్రభుత్వం కేవలం ఖండించడంతోనే చేతులు దులిపేసుకోకుండా వాటిపై సీరియస్గా దృష్టి సారించాలని పేర్కొన్నారు.
ఈ హత్యల వెనుక ఉన్న కారణాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని మాయవతి అన్నారు. అలాగే, గోరక్ష, లవ్ జిహాద్, యాంటి రోమియో, ఘర్ వాపసీ వంటి వాటిని కూడా ప్రజలు గమనిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకోవడం లేదని ఆమె విమర్శించారు.