: టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి కొత్త బిరుదు ఇచ్చిన ఐసీసీ
‘ఛేజ్ మాస్టర్’ అంటూ టీమిండియా సారథి విరాట్ కోహ్లీకి ఐసీసీ కొత్త బిరుదు ఇచ్చింది. ఇటీవల జరిగిన శ్రీలంక, భారత్ క్రికెట్ మ్యాచ్లలో కోహ్లీ అధికంగా మొదట బౌలింగ్ తీసుకోవడానికే ఇష్టపడిన విషయం తెలిసిందే. గతంలోనూ కోహ్లీ ఛేదన వైపే మొగ్గు చూపాడు. అలాగే ఛేదనలో కోహ్లీ సులువుగా పరుగులు రాబడతాడు. కోహ్లీ సాధించిన పరుగుల్లో ఎక్కువగా ఛేదన ద్వారా వచ్చినవే. టీ20 ల్లో ఛేదనలో కోహ్లీ మొత్తం 1,016 పరుగులు రాబట్టాడు.
నిన్న జరిగిన మ్యాచ్లోనూ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న కోహ్లీ... శ్రీలంక ఇచ్చిన లక్ష్య ఛేదనలో చెలరేగి ఆడి 82 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. దీంతో ఐసీసీ కోహ్లీని ఛేజ్ మాస్టర్ అని పేర్కొంటూ ఆయన చెలరేగి ఆడడంతో టీమిండియా విజయం సాధించిందని పేర్కొంది. ఇప్పటికే కోహ్లీకి చీకూ, ఇండియన్ రన్ మిషెన్, పరుగుల వీరుడు అని ఎన్నో పేర్లు ఉన్న విషయం తెలిసిందే.