: బెల్టుషాపులు నిర్వహించే వారి బెల్టు తీశా.. మర్యాదగా దారికి వస్తే సరి: సీఎం చంద్రబాబు
ఇసుక దందాలు చేస్తే ఖబడ్దార్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకి నీరు అందించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ఈ రోజు కృష్ణా జిల్లా రెడ్డి గూడెం మండలం చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మంచిపనులు చేసిన వారికి నీరాజనాలు పలికే సంస్కృతి మనదని అన్నారు. అందుకే బ్రిటిష్ వాడైనా కాటన్ దొరను ఆరాధిస్తున్నామని చెప్పారు. చెడు పనులు చేస్తే మాత్రం తమ ప్రభుత్వం వదలిపెట్టదని హెచ్చరించారు. బెల్టుషాపులు నిర్వహించే వారి బెల్టు తీశానని, ఇంకా ఎవరైనా ఉంటే మర్యాదగా దారికి వస్తే సరి అని అన్నారు. తమ ప్రభుత్వం ఏడాదిలోపు పట్టిసీమను పూర్తి చేసి గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు తీసుకొచ్చిందని చెప్పారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు.