: జికా వైరస్‌తో మెదడు కేన్సర్‌కు చికిత్స.... సాధ్యమే అంటున్న పరిశోధకులు
గర్భస్థ శిశువుల్లో మెదడు ఎదుగుదలను అడ్డుకునే జికా వైరస్ ద్వారా మధ్యవయస్కుల్లో కలిగే మెదడు కేన్సర్‌కు చికిత్స చేయవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు కణాలను నాశనం చేయగల జికా వైరస్ శక్తిని, కేన్సర్ కణాలను నాశనం చేసేలా ఉపయోగించుకోవచ్చని వారు పేర్కొన్నారు. అమెరికాలో ఏటా 12,000 మంది `గ్లియోబ్లాస్టోమా`గా పిలిచే మెదడు కేన్సర్ బారిన పడుతున్నారు. వారికి కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ చేసినా, పెద్దగా లాభం కనిపించడం లేదు.
చికిత్స చేసిన ఏడాది, రెండేళ్లకే మళ్లీ మెదడులో కేన్సర్ కణాలు వృద్ధి చెందుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. అయితే కీమోథెరపీ, రేడియేషన్‌లను కూడా తట్టుకొని వృద్ధి చెందుతున్న ఈ కణాలను జికా వైరస్ సహాయంతో చంపే అవకాశం ఉందని వారు వివరించారు. ఇందుకోసం జికా వైరస్‌ను సరాసరి మెదడులో వృద్ధి చెందిన కేన్సర్ కణాల్లోకి ఎక్కించాలని వారు సూచించారు. ఈ రకంగా సెయింట్ లూయిస్‌లోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధనా కేంద్రంలో 23 ఎలుకలపై చేసిన ప్రయోగంలో మంచి ఫలితాలు కనిపించాయని వారు పేర్కొన్నారు.