: మీలో ఇంత ఉత్సాహాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు: కృష్ణాజిల్లా వాసులతో చంద్రబాబు
‘మీలో ఇంత ఉత్సాహాన్ని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు’ అని కృష్ణాజిల్లా ప్రజలను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం మద్దులపర్వలో చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను ఈ రోజు చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా ఈ పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... తాను ఈ ప్రాంతానికి ఎన్నోసార్లు వచ్చానని చెప్పారు. అయితే, ఈ రోజు తాను వస్తోంటే ప్రజలు ఎంతో హుషారుగా కనిపించారని, ఎన్నో ఏర్పాట్లు చేసుకుని స్వాగతం పలికారని, దీన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు.
నిన్న తాను ఒక పిలుపు ఇచ్చానని, జలసిరికి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించానని చంద్రబాబు నాయుడు అన్నారు. భూగర్భ జలాలు ఇంకి పోతున్నాయని, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు ఎదురుకాకుండా ఉండాలంటే అందరూ ప్రకృతిని ఆరాధించే జలసిరి కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు.