: తన ముందే తగాదాకు దిగిన హిందూపురం టీడీపీ నేతలపై బాలయ్య సీరియస్!
హిందూపురం టీడీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం పట్ల ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సీరియస్ అయ్యారు. అందరూ కలసి పనిచేయాలని... లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో నిన్న బాలయ్య సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో నేతల మధ్య గ్రూపు తగాదాలు మరోసారి బయటపడ్డాయి. బాలయ్య ముందే నేతలు ఒకరిపై మరొకరు విమర్శలకు దిగారు. దీంతో, బాలయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ తనతో పాటు కలసి పనిచేయాలని... లేకపోతే వెళ్లిపోవాలని వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలోని ప్రజల చెంతకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేర్చాలన్నదే తన తపన అని... ఈ నేపథ్యంలో, నేతలంతా విభేదాలను మరిచి, తనతో పాటు కలసి పని చేయాలని సూచించారు. నేతల మధ్య సయోధ్య కుదిర్చి, ఒకరి మండలాల్లో మరొకరు కలగజేసుకోవద్దని చెప్పారు. ఇదే సమయంలో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ పై కూడా టీడీపీ నేతలు బాలయ్యకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యవహారంతో అభివృద్ధి కుంటుపడిందని వారు ఆరోపించారు.