: శపథం వీడి, స్వామివారిపై అలకమాని తిరుమలకు వచ్చిన త్రిదండి చినజీయర్ స్వామి
తిరుమలలో అభివృద్ధి పేరిట గతంలో నేలమట్టం చేసిన వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి పునర్నిర్మించేంత వరకూ కొండపై కాలు పెట్టనని శపథం చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి మెట్టుదిగారు. తన అలకను వీడి ఈ ఉదయం తిరుమలకు వచ్చి వెంకటేశ్వరుని సేవలో మునిగిపోయారు. గతంలో వెయ్యి కాళ్ల మండపం నిర్మించకుంటే, స్వామిని దర్శించుకునేది లేదని ప్రతిన బూనిన ఆయన, తన శిష్య బృందంతో సహా వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వెయ్యి కాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోనున్నాయని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడచుకునే పాలకులు ఇప్పుడున్నారని చెప్పారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందని కితాబిచ్చారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు.