: గుర్మీత్ రాం రహీం సింగ్ ను ఎద్దేవా చేసిన బాలీవుడ్ నటుడు!
అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ కావడంతో రోహ్ తక్ జైల్లో 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌధా అధినేత గుర్మీత్ రాం రహీం సింగ్ ను హిందీ హాస్య నటుడు కీకూ శార్ధ వదలడం లేదు. 2016లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కీకు శార్దా గుర్మీత్ పై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. దీంతో తమ బాబాను అవమానించాడంటూ గుర్మీత్ అనుచరులు కీకుపై కేసు పెట్టారు. దీంతో ఆయన ఒక రోజు జైలు శిక్ష కూడా అనుభవించాడు.
కాగా, నిన్న ముంబైలో ‘2016 ది ఎండ్’ సినిమా ఆడియో లాంచ్ కు కీకు హాజరయ్యాడు. ఈ సినిమాలో కీలక భూమిక పోషిస్తున్న దివ్యేందు శర్మ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. దివ్యేందు శర్మను బాలీవుడ్ కు పరిచయం చేసింది డేరా బాబానే కావడం విశేషం.
ఈ నేపథ్యంలో వేదకపైకి వచ్చిన కీకు, దివ్యేందును ప్రేక్షకులకు పరిచయం చేస్తూ, ‘ఇతను దివ్యేందు శర్మ. ఆఖరిగా టాయ్ లెట్ (టాయ్ లెట్ :ఏక్ ప్రేమ్ కథా) చిత్రంలో కనిపించాడు’ అన్నాడు. దీనికి దివ్యేందు స్పందిస్తూ, ‘అవును, అప్పుడు మీరు జైల్లో ఉన్నారు’ అన్నాడు. దీనికి వెంటనే దీటుగా స్పందించిన కీకు... ‘అవును, నేను ఒక్కరోజే జైల్లో ఉన్నాను. కానీ సర్ (గుర్మీత్) 20 ఏళ్లు జైల్లో ఉంటారు’ అని చమత్కరించాడు. దీంతో నవ్వులు పూశాయి. కాగా, కీకు శార్దా ద కపిల్ శర్మ షో లో కీలక పాత్ర పోషిస్తాడు. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించాడు.