: చంద్రబాబు కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు: వంగవీటి రాధా
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వంగవీటి రాధా తీవ్ర విమర్శలు చేశారు. ఒక మాజీ ఎమ్మెల్యే అయిన తనను, మాజీ మహిళా ఎమ్మెల్యే అయిన తన తల్లిని పోలీసులు బలవంతంగా లాక్కెళ్లినా చంద్రబాబు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆయన మండిపడ్డారు. వాస్తవాలను తెలుసుకోకుండా చంద్రబాబు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని అన్నారు. వైసీపీలో ఎవరు తప్పు చేసినా వెంటనే చర్యలు తీసుకుంటారని చెప్పారు. వంగవీటి రంగా గురించి తమ నేత ఒకరు తప్పుగా మాట్లాడితే, తమ అధినేత జగన్ వెంటనే చర్యలు తీసుకున్నారని అన్నారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏమి చేసినా చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులు అధికారులపై దాడులకు కూడా దిగారని... అయినా చంద్రబాబు వారిని ఏమీ అనలేదని విమర్శించారు. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సాక్షాత్తు చంద్రబాబునే విమర్శించినా పట్టించుకోని దుస్థితి టీడీపీలో నెలకొందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుకు కామన్ సెన్స్ కూడా లేదని... మొన్న జరిగిన విషయాన్ని తెలుసుకోకుండానే మాట్లాడుతున్నారని రాధా మండిపడ్డారు. ప్రెస్ మీట్ కు వెళుతుండగా తనను పోలీసులు అడ్డుకున్నారని.. ఆ తర్వాత తనను, తన తల్లిని రోడ్లపై ఈడ్చుకుంటూ వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు జరిగిన ఘటనపై విచారణ జరిపించాలని, చట్ట విరుద్ధంగా ప్రవర్తించిన అధికారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తామని చెప్పారు.