: పట్టపగలు హైదరాబాద్ ను కమ్మేసిన చీకటి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాలు!
పట్టపగలు హైదరాబాద్ ను చీకటి కమ్మేసింది. దట్టమైన మబ్బులు నగరాన్ని చుట్టుముట్టాయి. మెట్రో రైలు స్టేషన్ల కింద చీకటి అలముకుంది. స్టేషన్ల కింద ప్రయాణించే వాహనాలు లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే, మేఘాలు ఎంత దట్టంగా కమ్మేశాయో అర్థం చేసుకోవచ్చు. దిల్ సుఖ్ నగర్, మెహిదీపట్నం, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హైదరాబాద్ వ్యాప్తంగా నేటి సాయంత్రంలోగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నిన్న మొదలైన వినాయక నిమజ్జనం ఇంకా కొనసాగుతుండగా, సాధ్యమైనంత త్వరగా నిమజ్జన ప్రక్రియను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదిలావుండగా, గత రాత్రి నుంచి అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురవగా, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఆదోనీ, మంత్రాలయం, కర్నూలు, పెనుకొండ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఆదోనిలో జనజీవనం స్తంభించిపోగా, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అక్కడి రైతుబజార్ నీట మునిగింది. కర్నూలులోని పలు ప్రాంతాలూ నీటితో నిండిపోయాయి. దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఈ స్థాయి వర్షపాతం నమోదైందని, చుక్క నీరు లేక ఎండిన చెక్ డ్యాములు, చెరువులు నీటితో నిండిపోయాయని అధికారులు వెల్లడించారు. కాగా, నల్గొండ జిల్లాలో పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.