: కోహ్లీతో పోలికా?... ఆసీస్, బంగ్లా క్రికెటర్ లను ఎద్దేవా చేస్తున్న నెటిజన్లు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో ఎంత నిలకడ ప్రదర్శిస్తాడో అందరికీ తెలిసిందే. వరుస సెంచరీలతో పాంటింగ్ రికార్డును కూడా బద్దలుగొట్టాడు. సచిన్ రికార్డు గురించి, సచిన్ తో పోలిక గురించి ఎప్పుడు మాట్లాడినా...మాస్టర్ తో తనకు పోలిక లేదని చెబుతాడు. ఆయన సాధించిన ఘనతల్లో కొన్ని సాధించినా చాలని చెబుతుంటాడు. ఈ ప్రస్తావన అంతా ఎందుకంటే...తాజాగా ఆస్ట్రేలియాతో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో విజయం సాధించిన బంగ్లాదేశ్ జోరుమీదుంది. రెండో టెస్టులో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు.
ఈ నేపథ్యంలో తన ప్రదర్శన గొప్పతనం గురించి చెబుతూ, ‘బంగ్లా ఆటగాడు షబ్బీర్ రెహ్మాన్ ( 113 బంతుల్లో 66 పరుగులు) మంచి ఆటగాడు. నాకు విరాట్ కోహ్లీని గుర్తుకు తెస్తున్నాడు’ అని కీర్తించాడు. దానికి బదులిచ్చిన షబ్బీర్...‘నేను విరాట్ కోహ్లీ లాంటి బ్యాట్స్ మన్ కాగలను. అన్నీ సాధ్యమే’ అన్నాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు వారిని ఎద్దేవా చేస్తున్నారు. 'నిజమే, షబ్బీర్ అద్భుతమైన ఆటగాడు, కోహ్లీలా ఆడడం కేవలం ‘ఫొటోషాప్ లోనే సాధ్యమవుతుంది’ అని ఎద్దేవా చేస్తున్నారు. ‘లియాన్, షబ్బీర్ లు నిద్ర నుంచి లేవాలిక’ అని వారిని మేల్కొల్పుతున్నారు. ‘స్మిత్ నుంచి లియాన్ కు బ్రెయిన్ ఫేడ్ వచ్చిందేమో’ అని నెటిజన్లు వారిని ఎద్దేవా చేస్తున్నారు.