: పెద్దనోట్ల రద్దు తర్వాత ఆ అకౌంట్లలో కోట్లాది రూపాయలు డిపాజిట్లు చేశారు!
గత ఏడాదిలో పెద్దనోట్ల రద్దు ప్రకటన అనంతరం ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఉన్న బ్యాంకుల ఖాతాల్లో కోట్లాది రూపాయల డిపాజిట్లు వచ్చి పడ్డాయట. ఈ విషయాన్ని ఆయా బ్యాంకుల అధికారులు తెలిపారు. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఓ ప్రశ్నకు పన్నెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమాధానమిచ్చాయి. 2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 31 వరకు రూ.31, 300 కోట్లకు పైగా నగదు డిపాజిట్ అయినట్టు ఆయా బ్యాంకు అధికారులు వెల్లడించారు.
అయితే, ఈ పన్నెండు బ్యాంకుల్లో అధికశాతం పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ రాష్ట్రంలోని బ్యాంకుల అకౌంట్లలో రూ.4843.91 కోట్లు డిపాజిట్ కాగా, ఉత్తరప్రదేశ్ లో రూ.4,167.24 కోట్లు డిపాజిట్ అయినట్టు ఆయా బ్యాంకుల రికార్డు ద్వారా తెలుస్తోంది. పంజాబ్, యూపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే, కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లోని బ్యాంకుల్లో ఈ తరహా డిపాజిట్లు తక్కువగా ఉన్నట్టు సమాచారం. దేశ వ్యాప్తంగా సుమారు 80 లక్షల 14 వేల ఈ తరహా అకౌంట్లలో భారీగా నగదు డిపాజిట్ చేయడం ద్వారా లావాదేవీలు జరుపుతున్నారట.