: తన భార్యను హింసించడానికి తల్లిదండ్రులను భారత్ నుంచి అమెరికాకు రప్పించుకున్న భర్త!
భార్యను చిత్రహింసలు పెట్టేందుకు ఓ భర్త వేసిన ప్లాన్ వెలుగులోకొచ్చింది. అందుకోసం ఆ భర్త తన తల్లిదండ్రులను ఉపయోగించుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే, భారత్‌కు చెందిన సిల్కీ గెయింద్ (33) తన భర్త దేవబిర్ తో కలిసి అమెరికాలో ఉంటోంది. వారి అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఓ ఏడాది పాప కూడా ఉంది. కాగా, కొన్ని రోజులుగా వారిద్దరు గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తన భార్యను ఎలాగైనా హింసించాలనుకున్న సదరు భర్త భారత్‌లో ఉంటోన్న తన తల్లిదండ్రులను అమెరికాకు పిలిపించుకున్నాడు.
తన భార్యను హింసించాలని వారికి చెప్పాడు. తాజాగా ఉద్దేశపూర్వకంగా భార్యతో గొడవపెట్టుకుని, ఆమెపై చెయ్యి చేసుకోబోయాడు. అయితే, ఆమె ప్రతిఘటించడంతో అతడి తల్లిదండ్రులు సిల్కీపై దాడికి దిగారు. ముగ్గురూ కలిసి ఆమెను చావబాదారు. ఆమె ఎత్తుకున్న పాపకు కూడా గాయాలు అయ్యాయి. ఆమెను చంపుతామంటూ కత్తితో బెదిరించి, ఆ రూమ్‌లో పడేసి బంధించారు.
తర్వాత సిల్కీ ఈ విషయాన్ని ఎలాగోలా ఇండియాలోని తన తల్లిదండ్రులకు తెలియజేసింది. దీంతో ఆమె తల్లి ఫ్లోరిడా పోలీసులకు సమాచారం అందించడంతో వారు హ్యూస్టన్ లో ఆమె ఉంటున్న నివాసానికి వచ్చారు. అయితే, ఆమె ఉంటోన్న ఇంటి తలుపులను అత్తమామలు ఎంతకీ తెరవలేదు. దీంతో పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి నిందితులని అరెస్టు చేశారు. ప్రస్తుతం సిల్కీతో పాటు ఆమె కూతురికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.