: ఆస్ట్రేలియాలో 'పాపం పసివాడు'... 60 గంటలు నడిచాడు...మూత్రం తాగి బతికాడు!
"అమ్మా చూడాలి.. నిన్ను, నాన్నను చూడాలి... నాన్నకు ముద్దు ఇవ్వాలి.. నీ ఒడిలో నిద్దుర పోవాలి" అన్న పాట తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలిసింది. 'పాపం పసివాడు' సినిమాలోని ఈ పాట నేపథ్యంలోని ఘటనే ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. దక్షిణ ఆస్ట్రేలియా, ఉత్తర టెరిటరీ సరిహద్దులోని ఓ మారుమూల ప్రాంతంలో టెక్నీషియన్ గా పని చేసే థామస్ మాసోన్ (21) కొద్దిరోజుల క్రితం విధులు ముగించుకుని కారులో వెళ్తున్నాడు. ఇంతలో అతని కారుకి అడవి ఒంటెల గుంపు ఎదురొచ్చింది. ఒంటెలు ఏదైనా హాని చేస్తాయోమోన్న ఆందోళనతో కారు దారి మార్చాడు. ఆ దారి ఆస్ట్రేలియాలో మనుషులెవ్వరూ వెళ్లని ప్రమాదకర ప్రాంతం.
ఈ దిశగా చాలాదూరం వెళ్లిన తరువాత కారు ప్రమాదానికి గురైంది. మసోన్ ఈ ప్రమాదం బారి నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. కారు మాత్రం మొరాయించింది. ఫోన్ సిగ్నల్స్ లేవు. దీంతో కారులో తన వద్ద ఏమున్నాయని సరి చూసుకున్నాడు. టార్చిలైటు, దుస్తులు మినహా ఏమీలేవు. దీంతో టార్చ్ లైట్ పట్టుకుని ఆ అడవి గుండా దారీతెన్నూ తెలియని స్థితిలో కాలినడక ప్రారంభించాడు. సుమారు 60 గంటలు నడుస్తూనే ఉన్నాడు, మధ్యలో ఆకలి వేస్తే...మూత్రంతో కడుపునింపుకున్నాడు. 140 కిలోమీటర్లు నడిచిన తరువాత ఒక హైవేను చేరుకున్నాడు. అప్పటికే అతని తల్లిదండ్రులు అతని కోసం వెతుకులాట ప్రారంభించారు. మూడో రోజు ముగుస్తుండగా మాసోన్ రోడ్డు చేరడం, అతని ఫోన్ కు సిగ్నల్స్ రావడం, పోలీసులు అతనిని గుర్తించడం ఒకేసారి జరిగాయి. దీంతో పోలీసులు, అతనిని చేరుకుని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. దీంతో కథ సుఖాంతమైంది.