: వివాదాస్పద వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన గౌతంరెడ్డి.. నేడు మీడియా ముందుకు?
వివాదాస్పద వ్యాఖ్యలతో బెజవాడలో తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ బహిష్కృత నేత గౌతంరెడ్డి వెనక్కి తగ్గారు. తన వ్యాఖ్యలు రంగా అభిమానులను బాధించి ఉంటే మరోలా భావించవద్దని వేడుకున్న ఆయన నేడు (మంగళవారం) మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. రంగా, ఆయన సోదరుడు రాధా హత్యలపై ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో ఆదివారం రాధాకృష్ణ, ఆయన అనుచరులు విజయవాడలో ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో స్పందించిన వైసీపీ చీఫ్ జగన్ పార్టీ నుంచి గౌతంరెడ్డిని సస్పెండ్ చేశారు.
కాగా, గౌతంరెడ్డి ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి ప్రసారమైంది. గౌతంరెడ్డి అభ్యర్థన మేరకు వివాదాస్పద వ్యాఖ్యలను ఇంటర్వ్యూ నుంచి తొలగించారు. ఇంటర్వ్యూ మరి కాసేపటిలో ముగుస్తుందనగా గౌతంరెడ్డి మాట్లాడుతూ తన వ్యాఖ్యలను అన్యదా భావించవద్దని రంగా అభిమానులను కోరారు. తన వ్యాఖ్యలపై నేడు ఆయన మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చే అవకాశం ఉంది.