: మళ్లీ గోపీచంద్ అకాడమీలో చేరా: సైనా నెహ్వాల్
సుమారు మూడేళ్లుగా గోపీచంద్ అకాడమీకి దూరంగా ఉన్న ప్రముఖ షట్లర్, 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతక విజేత సైనా నెహ్వాల్ మళ్లీ పాత గూటికే చేరింది. తాను తిరిగి గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకునేందుకు సిద్ధమైన విషయాన్ని తన అభిమానులకు స్వయంగా సైనా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది.
‘హాయ్ ఫ్రెండ్స్.. ప్రతిఒక్కరితో ఓ విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గోపీచంద్ అకాడమీలో తిరిగి శిక్షణ పొందేందుకు రావాలని కొంత కాలంగా ఆలోచిస్తున్నాను. ఈ విషయమై గోపీ సార్ తో చర్చించాను. నాకు తిరిగి శిక్షణ ఇచ్చేందుకు అంగీకరించిన ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. గోపీచంద్ ఆధ్వర్యంలో నా కెరీర్ లో మరిన్ని లక్ష్యాలను సాధిస్తానని భావిస్తున్నా. గత మూడేళ్లుగా నాకు శిక్షణ ఇచ్చిన విమల్ సార్ కు చాలా కృతఙ్ఞతలు. బ్యాడ్మింటన్ లో వరల్డ్ నెం 1 ర్యాంకింగ్ ను నేను సొంతం చేసుకోవడంలో ఆయన ఎంతో కృషి చేశారు. 2015, 2017 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో సిల్వర్, కాంస్య పతకాలతో పాటు, ఎన్నో సూపర్ సిరీస్ టైటిల్స్ ను కైవసం చేసుకోవడంలో ఆయన పాత్ర మరవలేను.
తిరిగి సొంత గూటికి చేరుకోవడం, హైదరాబాద్ లో శిక్షణ పొందడం నాకు ఎంతో సంతోషంగా ఉంది’ అని సైనా తన వరుస ట్వీట్లలో పేర్కొంది. కాగా, గోపీచంద్, సైనా మధ్య నెలకొన్న అభిప్రాయభేదాల కారణంగా 2014లో ఆసియా గేమ్స్ కు ముందు ఆ అకాడమీని సైనా వీడింది. బెంగళూరులోని కోచ్ విమల్ కుమార్ వద్ద సైనా సుమారు మూడేళ్ల పాటు శిక్షణ తీసుకుంది.