: తృణమూల్ ఎంపీ అహ్మద్ గుండెపోటుతో మృతి
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుల్తాన్ అహ్మద్ (64) గుండెపోటుతో మృతి చెందారు. కొన్ని రోజులుగా గుండెపోటు సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఈ రోజు ఉదయం కోల్ కతాలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గతంలో అహ్మద్ కు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు జరిగాయి. కాగా, అహ్మద్ మృతిపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు. అహ్మద్ కుటుంబానికి ‘తృణమూల్’ అండగా ఉంటుందని మమత తన ట్వీట్ లో పేర్కొన్నారు.
కాగా, 1969లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్ సీ)కు చెందిన స్టూడెంట్ వింగ్ చాత్రా పరిషత్ లో ఆయన సభ్యుడిగా చేరారు. ఆ తర్వాత 1973 లో యూత్ కాంగ్రెస్ సభ్యత్వం తీసుకున్నారు. 1978-80 వరకు యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా పని చేశారు.1987,1996 లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో కేంద్ర టూరిజం శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత ‘తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోకి మారిన అహ్మద్, 15వ, 16వ లోక్ సభ ఎన్నికలకు పార్టీ తరపున పోటీ చేసి ఆయన విజయం సాధించారు.