: పరీక్షకు హాజరు కాలేదు... అయినా 21 మార్కులు వేసిన ముంబై యూనివర్సిటీ
ఫలితాలు వెల్లడించిన ప్రతిసారీ మార్కుల అవకతవకల విషయంలో ముంబై యూనివర్సిటీ వార్తల్లోకెక్కుతుంది. సాధారణంగా చాలా మంది విద్యార్థులు తాము పరీక్ష రాసినా మార్కులు ఇవ్వలేదని, తక్కువ మార్కులు వేశారని ఫిర్యాదు చేస్తుంటారు. ఇలాంటి ఫిర్యాదులతో ముంబై యూనివర్సిటీ విసిగిపోయినట్లుంది, అందుకే పరీక్షకు హాజరు కాకపోయినా లా చదువుతున్న విద్యార్థినికి 21 మార్కులు వేసింది.
తాను హాజరుకాని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సబ్జెక్టులో తనకు 21 మార్కులు రావడం చూసి తాను ఆశ్చర్యానికి గురైనట్లు ఆ విద్యార్థిని మీడియాకు తెలిపింది. ఇప్పటికే డిగ్రీ ఫలితాలను విడుదల చేయడంలో విపరీతమైన జాప్యం చేస్తున్న కారణంగా ముంబై యూనివర్సిటీ, హైకోర్టు నుంచి హెచ్చరికలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇవన్నీ చూస్తుంటే ముంబై యూనివర్సిటీ పరీక్షల విభాగంలో ఏదో పెద్ద అవినీతి జరుగుతోందన్న అనుమానం కలుగుతుందని విద్యానిపుణులు అభిప్రాయపడుతున్నారు.