: చెస్‌లో `క్వీన్స్ పజిల్` పరిష్కరించే కోడ్ రాస్తే... మిలియన్ డాలర్లు గెల్చుకోవచ్చు!
చదరంగంలో `క్వీన్స్ పజిల్`ను కంప్యూటర్ ద్వారా పరిష్కరిస్తే ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని అమెరికాలోని క్లే మేథమేటిక్స్ ఇనిస్టిట్యూట్ ప్రకటించింది. ప్రోగ్రామింగ్ ద్వారా ఈ పజిల్ పరిష్కరించడం అసాధ్యమని వారు పేర్కొంటున్నారు. ఈ పజిల్లో చెస్ బోర్డు మీద ఎనిమిది క్వీన్లను ఒకదానితో ఒకటి దాడి చేయకుండా అమర్చాలి. సాధారణ 64 గళ్ల చెస్ బోర్డుపై ఈ సమస్యను పరిష్కరించడం కుదురుతుంది. కానీ గళ్లల సంఖ్య పెరిగే కొద్ది ఈ పజిల్ మరింత సంక్లిష్టంగా మారుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఉదాహరణకు 1000 బై 1000 చెస్‌బోర్డు మీద ఈ క్వీన్స్ పజిల్‌ను పరిష్కరించడానికి కంప్యూటర్‌కు కొన్ని ఏళ్ల సమయం పట్టొచ్చని ఇనిస్టిట్యూట్ వారు చెబుతున్నారు. అందుకే తక్కువ సమయంలో అన్ని రకాల చెస్బోర్డుల మీద ఈ పజిల్‌ను పరిష్కరించగల కోడ్ రాసిన వారికి మిలియన్ డాలర్లు బహుమానంగా ఇస్తామని వారు బహిరంగ ప్రకటన చేశారు. ఒకవేళ ఏదైనా ప్రోగ్రాం ద్వారా ఈ పజిల్‌ను పరిష్కరించగలిగితే ఆ ప్రోగ్రాం మిగతా సంక్లిష్ట సమస్యలకు కూడా అనువర్తించే అవకాశం కలుగుతుందని సెయింట్ ఆండ్రూస్ పరిశోధకులు తెలియజేశారు.