: రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేసిన జర్మనీ
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఓ నిర్మాణం కోసం తవ్విన ప్రదేశంలో రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన బాంబు బయటపడిన సంగతి తెలిసిందే. దీనిని ఆదివారం జర్మనీ బాంబు నిర్వీర్య నిపుణులు విజయవంతంగా నిర్వీర్యం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలో నివసించే 60,000 మందిని ఖాళీ చేయించారు. బాంబు ప్రభావం అధికంగా ఉంటుందని శాస్త్రవేత్తలు అంచనా వేయడంతో 60 వేల మందిని ఖాళీ చేయించడానికి ఫ్రాంక్ఫర్ట్ సిద్ధపడింది. ఖాళీ చేయించిన ప్రదేశాల్లో రెండు ఆసుపత్రులు, బ్యాంకులతో పాటు ఇతర సామాజిక సముదాయాలు ఉన్నాయి. యుద్ధ సమయంలో మినహా ఇలాంటి చర్య తీసుకోవడానికి ఎవరూ సాహసించరు. ఇంత సాహసం చేసి, బాంబును విజయవంతంగా నిర్వీర్యం చేయడంతో అక్కడి స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.