: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు.. హద్దులు చెరిపేసిన తొలి మంత్రిగా రికార్డు!
రక్షణ శాఖామంత్రిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన నిర్మలా సీతారామన్ (58) చరిత్ర సృష్టించారు. 2014 నుంచి బీజేపీ అధికార ప్రతినిధిగా, వాణిజ్య శాఖ సహాయమంత్రిగా ఉన్న ఆమెకు ప్రధాని మోదీ ఏకంగా కీలకమైన రక్షణ శాఖను అప్పగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇక రక్షణ శాఖ బాధ్యతలు స్వీకరించిన సీతారామన్ ఆ శాఖను నిర్వహిస్తున్న రెండో మహిళగా చరిత్రకెక్కారు.
గతంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉంటూనే రక్షణ శాఖను చూసేవారు. అయితే ఆ శాఖ బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టిన తొలి మహిళ మాత్రం నిర్మలనే. ఇక మోదీ కేబినెట్లో కీలక పదవుల్లో ఇద్దరు మహిళలు ఉండడం గమనార్హం. సుష్మాస్వరాజ్ విదేశీ వ్యవహారాలు చూస్తుండగా, ఇప్పుడు నిర్మల ఏకంగా రక్షణ మంత్రి పదవి చేపట్టారు. ప్రమాణ స్వీకారం అనంతరం నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ యుద్ధ రంగంలోకి మహిళలను తీసుకోవడంపై దృష్టి సారించనున్నట్టు తెలిపారు.