: భారీకాయుడి బాధ: సిక్సర్లు, ఫోర్లు బాదాడు... పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు!
బ్యాంటింగ్ కు దిగి సిక్స్ లు, ఫోర్లతో స్టేడియంలోని ప్రేక్షకులను కేరింతలు కొట్టేలా చేసిన విండీస్ బ్యాట్స్ మన్ పరుగెత్తలేక రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన ఘటన ఆసక్తి రేపుతోంది. ఆ వివరాల్లోకి వెళ్తే... వెస్టిండీస్ లో కరీబియన్ లీగ్ మ్యాచ్ జరుగుతోంది. ఇందులో నిన్న బార్బడోస్ ట్రైడెంట్స్, సెయింట్ లూయిస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బార్బొడోస్ జట్టు 195 పరుగులు చేసింది. సెంచరీతో డ్వెన్ బ్రావో కదంతొక్కాడు. దీంతో ఆ జట్టు ప్రత్యర్థి సెయింట్ లూయీస్ జట్టుకు భారీ లక్ష్యం విధించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో ఆ జట్టులో భారీకాయుడిగా పేరొందిన రకీమ్ కార్నివాల్ (153 కేజీలు) బౌలర్లపై విరుచుకుపడి ఆదుకున్నాడు.
సిక్సర్లు, బౌండరీలతో బౌలర్లను ఆటాడుకున్నాడు. కేవలం 44 బంతుల్లోనే 78 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఈ భారీ కాయుడికి వికెట్ల మధ్య పరుగులు తీయడం కష్టంగా మారింది. దీంతో 18వ ఓవర్ రెండో బంతి సమయంలో కడుపునొప్పి బాధించడంతో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. దీంతో ఆ జట్టు 29 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇలా శరీర బరువు మోయలేక ఇబ్బందికి గురై ఓ బ్యాట్స్ మేన్ రిటైర్డ్ హర్ట్ అయిన తొలి సంఘటన ఇదే కావడం విశేషం. గతంలో ఎవరైనా గాయాల పాలైతే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇలా రిటైర్డ్ హర్ట్ అయిన సంఘటనలు లేకపోవడం విశేషం.