: జగన్ పై తీవ్ర విమర్శలు చేసిన కళా వెంకట్రావు


ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు ఉన్న నమ్మకమే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీకి ఘన విజయాన్ని కట్టబెట్టిందని ఆ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ప్రజలంతా ఎంతో సంతోషంగా ఉన్నారనే విషయం నంద్యాల, కాకినాడ ఎన్నికలతో రుజువయిందని చెప్పారు. మూడేళ్ల పాలనలో అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతూ ప్రజలకు చంద్రబాబు ఎంతో దగ్గరయ్యారని తెలిపారు. ఏ సర్వేలో చూసినా 80 శాతానికి పైగా ప్రజలు చంద్రబాబు పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారనే వచ్చిందని చెప్పారు. అరాచక శక్తులకు నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాలు చెంపపెట్టని అన్నారు. రానున్న రోజుల్లో ఇవే ఫలితాలు పునరావృతమవుతాయని చెప్పారు.

ఇదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్ పై కళా వెంకట్రావు నిప్పులు చెరిగారు. తనపై ఉన్న కేసుల నుంచి బయటపడేందుకే జగన్ పార్టీని నడుపుతున్నారని జనాలు భావిస్తున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ లక్షణాలు వైసీపీలో లేవని... 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వల్ల ఆ పార్టీ పుట్టిందని ఎద్దేవా చేశారు. మరో మూడు నెలల్లో ముఖ్యమంత్రిని అయిపోతానని తనకు పలానా వ్యక్తి చెప్పాడు, రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటూ జగన్ భ్రమల్లో గడిపేస్తున్నారని అన్నారు. ఏయ్ డీఎస్పీ నిన్ను సస్పెండ్ చేస్తా, ఏయ్ కలెక్టర్ నిన్ను జైల్లో పెడతానంటూ... ఎలా పడితే అలా జగన్ మాట్లాడటం అందరూ చూశారని చెప్పారు. నంద్యాల ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడిన తీరును కూడా అందరూ చూశారని... అధికార దాహంతో, తనపై ఉన్న కేసులను తప్పించుకునే ఆలోచనతో ప్రజలను జగన్ మాయ చేసే ప్రయత్నం చేశారని తెలిపారు. జగన్ ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గురించి జగన్ కు ఓ పాలసీ, ఇంప్లిమెంటేషన్ అంటూ ఏమీ లేవని ఎద్దేవా చేశారు. 

  • Loading...

More Telugu News