: బ్రిక్స్ సమావేశాల్లో పాకిస్థాన్ ఉగ్రవాదం ప్రసక్తి తీసుకురావొద్దు... ప్రధాని మోదీకి బీజింగ్ వినతి
ప్రధాని మోదీ హాజరవనున్న బ్రిక్స్ సమావేశాల్లో ఉగ్రవాద నిర్మూలనలో పాకిస్థాన్ పాత్ర గురించి చర్చించడానికి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తామని బీజింగ్ సంకేతాలిచ్చింది. గతంలో గోవా బ్రిక్స్ సమావేశంలో మాదిరిగానే ఈ సమావేశంలో కూడా ప్రధాని మోదీ పాకిస్థాన్ అంశాన్ని లేవనెత్తుతారేమోనని చైనా ఆందోళన చెందుతోంది. అందుకే ముందు జాగ్రత్తగా పాకిస్థాన్ ఉగ్రవాదానికి కొమ్ము కాస్తుందనే అంశాన్ని బ్రిక్స్ సమావేశంలో చర్చించవద్దని ప్రధానికి విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.
`భారత్ దృష్టి నుంచి చూస్తే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పెద్ద సమస్యే, కానీ బ్రిక్స్ దేశాల దృష్టి నుంచి ఆ అంశానికి అంతగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదు` అని చైనా విదేశాంగ ప్రతినిధి హూ చున్యింగ్ తెలిపారు. అలాగే పాకిస్థాన్ ప్రసక్తి తీసుకురావడం వల్ల సమావేశం విజయవంతం కావడంపై ప్రభావం పడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. `బ్రిక్స్ సమావేశాల్లో జరగనున్న చర్చలపై ప్రపంచమంతా దృష్టి సారిస్తుంది. అందుకే ప్రపంచానికి ఉపయోగపడే అంశాలు చర్చించడంలో చైనాకు సహకరించాలని కోరుతున్నాం` అని చున్యింగ్ అన్నారు. సెప్టెంబర్ 3 - 5 వరకు చైనాలో గ్జియామెన్ ప్రాంతంలో బ్రిక్స్ సమావేశాలు జరగనున్నాయి.