: నాలుగో వన్డేలో రికార్డు సృష్టించిన మలింగ.. భవిష్యత్తుపై పునరాలోచన.. జట్టుకు ఉపయోగం లేనప్పుడు జట్టులో ఉండడం దండగన్న స్టార్ బౌలర్!


భారత్‌తో గురువారం కొలంబోలో జరిగిన నాలుగో వన్డేలో శ్రీలంక జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన పేసర్ లసిత్ మలింగ తన భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డాడు. ఈ వన్డేలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ వికెట్ తీసి మూడు వందల వికెట్లను తన ఖాతాలో వేసుకున్న మలింగ సోమవారం 34వ ఏట ప్రవేశించాడు. దీంతో భారత్‌తో సిరీస్ ముగిశాక తన కెరీర్‌పై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నాడు.

మోకాలి గాయం కారణంగా 19  నెలలపాటు జట్టుకు దూరంగా ఉన్న ఈ స్టార్ బౌలర్ జూన్‌లో జట్టులోకి తిరిగొచ్చాడు. అప్పటి నుంచి 12 మ్యాచ్‌లు ఆడిన మలింగ 9 వికెట్లు పడగొట్టాడు. తాజా సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. తాను 19 నెలల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చానని, జింబాబ్వే, ఇండియా  సిరీస్‌లలో తాను ఉత్తమ ప్రదర్శన కనబర్చలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సిరీస్ తర్వాత తానెక్కడ ఉండాలన్నది నిర్ణయించుకుంటానని తెలిపాడు. అయితే ఎంతకాలం ఆడతానన్న విషయాన్ని మాత్రం చెప్పలేనన్నాడు. తన వల్ల జట్టుకు ఉపయోగం లేనప్పుడు జట్టులో ఉండడం అర్థరహితమన్నాడు. అతడి మాటలను బట్టి భారత్‌తో సిరీస్ తర్వాత రిటైరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని క్రీడా పండితులు చెబుతున్నారు. కాగా, గురువారం జరిగిన వన్డేలో వన్డే కెరీర్‌లో 300 వికెట్లు తీసిన నాలుగో శ్రీలంక ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

  • Loading...

More Telugu News