: అమెరికాలో తెలుగు కుటుంబాల ఆకలి కేకలు.. ‘హార్వే’ ధాటికి ప్రవాస భారతీయులు విలవిల!
హార్వే తుపాను ధాటికి అమెరికాలోని హూస్టన్ విలవిల్లాడుతోంది. హరికేన్లో చిక్కుకుని తెలుగు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. హూస్టన్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల మంది ప్రవాస భారతీయులు నివసిస్తుండగా వారిలో తెలుగువారే ఎక్కువ. తుపాను కారణంగా హూస్టన్ అతలాకుతలమవడంతో ఏమీ దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో ఆకలి బాధలు తప్పడం లేదు.
మరోవైపు వందలాది ఇళ్లు నీట మునిగాయి. రవాణా వ్యవస్థ స్తంభించింది. నిరాశ్రయులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రవాస భారతీయులు ఎక్కడికక్కడ ఆలయాలు, మసీదులు, గురుద్వారాలు, విద్యాసంస్థల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. అలాగే సురక్షితంగా ఉన్న ఒక్కో కుటుంబమూ మరో రెండుమూడు కుటుంబాలకు ఆశ్రయం ఇచ్చింది. సోషల్ మీడియా ద్వారా అన్నార్తులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వరద బాధితులను ఆదుకునేందుకు అక్కడి ప్రవాస భారతీయ హోటళ్లు ముందుకొచ్చాయి. ఒక్కో హోటల్ రెండువేల మందికి ఆహారాన్ని సరఫరా చేస్తోంది. వరదల కారణంగా అమెరికాలో చమురు ధరలు అమాంతం పెరిగిపోయాయి. గ్యాలన్ పెట్రోలు ధర ఏకంగా రెండేళ్ల గరిష్టానికి చేరింది.