: ముంబై బాధితులను ఆదుకున్న ‘ఫిదా’ ఫేమ్ హర్షవర్ధన్ రానే
భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ముంబై లో బాధితులకు ప్రముఖనటుడు హర్షవర్ధన్ రానే తన వంతు సాయం చేశాడు. ‘అవును’, ‘ఫిదా’ చిత్రాల ద్వారా ఫేమ్ అయిన హర్షవర్ధన్, ముంబైలో నిన్న వర్షం కురుస్తున్న సమయంలో తన కారులో బయటకు వెళ్లారు. తన నివాసానికి సమీపంలో కొందరు బాధితులు మోకాలి లోతు నీటిలో చిక్కుకుపోయి ఇబ్బంది పడుతుండడాన్ని గమనించాడు.
వెంటనే, బాధితులను తన వాహనంలో ఎక్కించుకుని సురక్షిత ప్రాంతానికి తరలించాడు. కాగా, హర్ష వర్ధన్ చేసిన సాయంపై పలువురు ప్రశంసించారు. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ, ‘సూపర్ హీరో హర్షవర్ధన్ రానే’ అంటూ కొనియాడారు. ఇందుకు ఆయన స్పందిస్తూ.. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేశానే తప్పా, ఇందులో హీరోయిజం ఏమీ లేదంటూ తన నిరాడంబరతను ఓ ట్వీట్ లో చాటుకున్నాడు.