: గంటగంటకూ పెరుగుతున్న ముంబై దుర్ఘటన మృతులు
ముంబైలోని భేండీ బజార్ లో కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనం దుర్ఘటనలో మృతుల సంఖ్య గంటగంటకూ పెరుగుతోంది. తొలుత ఒకరు మరణించారని చెప్పిన అధికారులు, ఆపై మరణాల సంఖ్యను నాలుగుకు పెంచగా, ఇప్పుడు అది 10కి చేరింది. ఈ ఉదయం ఐదంతస్తుల భవనం కుప్పకూలగా, అందులో మొత్తం 9 కుటుంబాలు ఉన్నాయని, వారి సంఖ్యపై స్పష్టమైన అవగాహన లేదని అధికారులు అంటున్నారు.
కాగా, రంగంలోకి దిగిన నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్, 10 అగ్నిమాపక దళాలు శిథిలాలను తొలగించే పనిలో ఉన్నాయి. ఉదయం 8.40కి భవంతి కుప్పకూలిందని, సమాచారం అందిన తక్షణమే ఆ ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలకు పూర్తిగా నానిపోవడం, భవంతిని సుమారు 100 సంవత్సరాలకు పూర్వం నిర్మించి ఉండటం ప్రమాదానికి కారణమని భావిస్తున్నట్టు తెలిపారు.