: డోక్లాం విషయం గురించి విదేశాంగ శాఖ మాత్రమే మాట్లాడాలి... మంత్రులకు ప్రధాని మోదీ ఆదేశం
భారత్ - చైనాల మధ్య సున్నితంగా మారిన డోక్లాం సరిహద్దు వివాదం గురించి కేవలం విదేశాంగ శాఖ మాత్రమే మాట్లాడాలని, మిగతా మంత్రులు ఆ విషయం గురించి చర్చించవద్దని మంత్రివర్గాన్ని ప్రధాని మోదీ ఆదేశించినట్లు సమాచారం. బ్రిక్స్ సమావేశాలకు హాజరవడానికి చైనా వెళ్లడానికి ముందు ప్రధాని కేబినెట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో డోక్లాం విషయం గురించి విదేశాంగ శాఖ చూసుకుంటుందని, ప్రకటనలు కూడా ఆ మంత్రిత్వ శాఖే చేస్తుందని ప్రధాని పేర్కొన్నట్లు తెలుస్తోంది.
ఇటీవల డోక్లాం వివాదంపై రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని ప్రశ్నించినపుడు ఆయన ఎలాంటి స్పందన ఇవ్వకుండా, మాటలు దాటేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 3-5 మధ్య చైనాలోని గ్జియామెన్ ప్రాంతంలో జరగనున్న 9వ బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని హాజరు కానున్న నేపథ్యంలో ఇతర మంత్రులు కూడా అలాగే ఉండాలని ప్రధాని నిర్దేశించినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.