: గంటలోనే కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులు.. దుండగుల చెర నుంచి వ్యాపారవేత్తకు విముక్తి!
కిడ్నాప్‌కు గురైన వ్యాపారవేత్తను పోలీసులు గంటలోనే విడిపించారు. మంగళవారం అర్ధరాత్రి ఢిల్లీలో జరిగిన మిడ్నైట్ డ్రామాలో చివరికి పోలీసులే విజయం సాధించారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారవేత్తను కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అనంతరం అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ వేశారు. కిడ్నాప్‌పై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన కిడ్నాపర్లు కాల్పులు జరిపారు. ఎదురుకాల్పుల్లో ఓ కిడ్నాపర్ గాయపడ్డారు.
ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వ్యాపారవేత్తను దుండగుల చెర నుంచి క్షేమంగా విడిపించినట్టు చెప్పారు. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది. ఇటీవలి కాలంలో ఢిల్లీలో కిడ్నాప్‌లు, పోలీసుల చేజింగ్ పరిపాటిగా మారింది. గతేడాది మేలో కిడ్నాపర్లు అపహరించిన మహిళను రక్షించేందుకు పోలీసులు గంటపాటు చేజింగ్ చేశారు. ఐదు కిలోమీటర్ల చేజింగ్ తర్వాత కిడ్నాపర్ల కారును ఢీకొట్టిన పోలీసులు వారిని పట్టుకుని మహిళను రక్షించారు.