: ఆగ్రహంతో ఆవులను, ఎద్దులను పాఠశాలలో బంధించిన గ్రామస్తులు!
ఉత్తరప్రదేశ్ లాఖిమ్‌పూర్ ఖేరీ జిల్లాలోని సాకేతు గ్రామస్తులు ఆవులు, ఎద్దులను ఓ పాఠశాలలో బంధించి నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో ఆవులు, ఎద్దులు తమ గ్రామంలో తిరుగుతూ పంటలను నాశనం చేస్తున్నాయని, ఇళ్ల ముందుకు వచ్చి వస్తువులన్నింటినీ పడేస్తున్నాయని ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని తాము ఇలా చేశామని చెప్పారు. తమ పాఠశాలలో ఆవులు, ఎద్దులు ఉండడంతో టీచర్లు, విద్యార్థులు అందులోకి వెళ్లలేకపోయారు. దీంతో నిన్న ఆ పాఠశాలలో పాఠాలు కొనసాగలేదు.
పశువుల వధపై కేంద్ర ప్రభుత్వం కఠినతర ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆ పశువుల యజమానులు వయసు ఎక్కువగా ఉన్న ఆవులను, ఎద్దులను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని ఆ గ్రామస్తులు చెప్పారు. ఆ పాఠశాలలో ఆవులు, ఎద్దులను బంధించి గ్రామస్తులు నిరసనకు దిగారని తెలుసుకున్న అధికారులు ఈ విషయాన్ని పోలీసులకి తెలిపారు. ఆ గ్రామానికి చేరుకున్న పోలీసులు గ్రామస్తుల సమస్యను పరిష్కరిస్తామని చెప్పి ఆ పశువులను విడిపించారు. ఈ నెల 13న కూడా అక్కడి పకారియా గ్రామంలో కూడా ప్రజలు ఇలాగే నిరసన తెలిపి, తమ సమస్యను పరిష్కరించుకున్నారు.