: ముంబై వరదల గురించి అమితాబ్ ట్వీట్.... అసంతృప్తి వ్యక్తం చేసిన నెటిజన్లు
సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ముంబైలో భారీగా కురిసిన వర్షాలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ప్రకృతితో పోరాడి ఎవరూ గెలవలేరని, అగ్రరాజ్యం అమెరికా కూడా హరికేన్ హార్వీను కట్టడి చేయలేకపోయిందని పేర్కొన్నారు. అకస్మాత్తుగా వచ్చిన ముంబై వర్షాలను, అమెరికాలోని హార్వీతో పోల్చినందుకు నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ముంబై వరదలు ప్రకృతి వల్ల వచ్చినవి కాదని, మన నిర్వాకాలే అందుకు కారణమని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ముంబై వరదలు, హరికేన్ హార్వీ ఒకటే అంటున్న అమితాబ్ అంచనా తప్పు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. `అమెరికాలో రాబోతున్న హరికేన్ గురించి వాళ్ల ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ముంబై నగర పాలక సంస్థ వర్షాల గురించి ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు కదా, వరదలతో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయక చర్యలు కూడా చేయడం లేదు. అనవసరంగా ప్రభుత్వాన్ని వెనకేసుకురాకండి` అంటూ మరో నెటిజన్ ఘాటుగా స్పందించాడు.