: కొబ్బరి నీళ్లతో కొత్త రుచులు.... కర్ణాటకలోని హసన్ జిల్లా కేంద్రం ప్రయోగం
కొబ్బరి కాయల అమ్మకాలను పెంచడానికి కర్ణాటకలోని హసన్ జిల్లా కేంద్రం పరిపాలన విభాగం ఓ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. కొబ్బరి నీళ్లను వివిధ రుచుల్లో అందించేందుకు ప్రయత్నిస్తోంది. తేనె, నిమ్మ ఫ్లేవర్లతో కొబ్బరి నీళ్లను అమ్మేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం `కోకోనట్ హట్` అనే కేంద్రాన్ని కూడా జిల్లా సరిహద్దులో నిర్మించబోతోంది.
బెంగళూరు నుంచి మంగళూరు వెళ్లేదారిలో ఉన్న హిరిసావే గ్రామంలో పూర్తిగా కొబ్బరి ఉత్పత్తులు అనగా పీచు, మట్టలు, ఆకులతో కోకోనట్ హట్‌ను నిర్మించడానికి స్థలం కూడా సిద్ధం చేసింది. ఇక్కడ కొబ్బరి నీళ్లు మాత్రమే కాకుండా ఇతర కొబ్బరి ఉత్పత్తులను, తినే పదార్థాలను కూడా అమ్మకానికి ఉంచనున్నారు. ఏడాది చివర్లోగా ఈ కేంద్రాన్ని ప్రారంభించేందుకు హసన్ జిల్లా యంత్రాంగం యత్నిస్తోంది. ఈ ప్రయత్నం విజయవంతమైతే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు తెలిపారు.