: ఢిల్లీలో ర్యాంప్ వాక్ చేయనున్న ఐఏఎస్ అధికారులు... ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి ప్రచారమే ధ్యేయం!
ఈశాన్య రాష్ట్రాల వస్త్రధారణను దేశానికి పరిచయం చేయడానికి ఆయా రాష్ట్రాల కార్మికులు నేసిన దుస్తులను ధరించి, ర్యాంప్‌వాక్ చేయడానికి ఐఏఎస్ అధికారులు ముందుకొచ్చారు. ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సెప్టెంబర్ 9-10 తేదీల్లో జరగనున్న వేడుకలో వీరు మోడల్స్ అవతారం ఎత్తనున్నారు. వీరంతా 2015 బ్యాచ్‌కి చెందిన వారే. ప్రస్తుతం కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా విధులు నిర్వహిస్తున్నారు.
న్యూఢిల్లీ, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఈశాన్య రాష్ట్ర విద్యార్థులపై వివక్ష దాడులు ఎక్కువ కావడంతో వారి సంస్కృతి, పద్ధతులను భాగం చేస్తూ వేడుకలు నిర్వహించాలని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మంత్రిత్వశాఖ 16వ వార్షికోత్సవం సందర్భంగా ఢిల్లీలో వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలో ఈశాన్య రాష్ట్రాల వారి వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు, వారి వంటకాలు, చేనేత ఉత్పత్తులు, కళలను ప్రదర్శించనున్నారు.