: మరో నెలలో భూమి అంతం... కోరికలు ఉంటే తీర్చుకోవాలని సలహా ఇస్తున్న కాన్ స్పిరసీ థియరిస్టులు!
వచ్చే నెల 20 నుంచి 23 తేదీల మధ్య భూమి అంతమైపోతుందని సరికొత్త ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మూడు రోజుల వ్యవధిలో నిబిరు అనే గ్రహం భూమిని ఢీకొట్టనుందని, దీనిపై భూమి ముక్కలైపోయి సమస్త జీవాలూ అంతమై పోతాయని కాన్ స్పిరసీ థియరిస్ట్ డేవిడ్ మీడ్ వెల్లడించారు. మరో 24 రోజులు మాత్రమే మానవాళి మనుగడని, దీనిపై బైబిల్ తో పాటు గిజా పిరమిడ్ లోనూ స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని అన్నారు. తీర్చుకోవాలన్న కోరికలు ఏమైనా మిగిలుంటే, ఈ లోగానే వాటిని తీర్చుకోవాలని సలహా కూడా ఇస్తున్నారు.
కాగా, ఈ సంవత్సరంలోనే భూమి అంతం కానుందని గతంలో చెప్పిన మీడ్, ఇప్పుడు ఆ తేదీలను కూడా చెప్పడం గమనార్హం. సెప్టెంబర్ రెండో వారం నుంచి నిబిరు గ్రహాన్ని ప్రజలందరూ స్పష్టంగా చూడవచ్చని అన్నారు. ఇదిలావుండగా, నిబిరు గ్రహం ప్రస్తావన జనవరి 2016లో తొలిసారిగా వచ్చింది. ప్రస్తుతం ఇది సౌర కుటుంబానికి అంచున ఉండగా, దీనిని ప్లానెట్ ఎక్స్ గా పిలుస్తున్నారు. వాస్తవానికి ఇది ఓ ఊహాజనిత గ్రహం. కొన్ని వందల ఏళ్ల క్రితం భూ కక్ష్యలోకి ప్రవేశించిందని విశ్వసిస్తున్న కాన్ స్పిరసీ థియరిస్టులు ఇప్పుడు కూడా మరోసారి అదే జరగనుందని నమ్ముతున్న పరిస్థితి నెలకొంది.