: ట్రంప్ వైఖరిలో మార్పు...రష్యాతో బలమైన బంధానికి ఆసక్తి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందని, రష్యాతో బలమైన బంధం కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఫిన్లాండ్ అధ్యక్షుడు సాలీ నిఇనిస్టోతో ఏర్పాటు చేసిన మీడియా సంయుక్త సమావేశంలో ట్రంప్ దీనిపై వివరణ ఇచ్చారు. అమెరికా, రష్యాలు భవిష్యత్ లో మంచి దౌత్యబంధాలను కొనసాగిస్తాయని భావిస్తున్నానని అన్నారు. అమెరికా, రష్యాల మైత్రి ప్రపంచ శాంతికి శుభపరిణామమని ఆయన చెప్పారు.
రష్యా అణుశక్తిగలిగిన పెద్ద దేశమని ఆయన పేర్కొన్నారు. తాము మంచి దౌత్య సంబంధాలు కొనసాగించాలనుకుంటున్న దేశాల్లో రష్యా కూడా ఒకటని ఆయన చెప్పారు. దీనిపై ఫిన్లాండ్ అధ్యక్షుడు మాట్లాడుతూ, రష్యా, అమెరికా బంధంపై ట్రంప్ తో చర్చించానని అన్నారు. ఈ రెండు దేశాల మధ్య దౌత్యాధికారుల విషయంలో వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయన వైఖరిలో వచ్చిన మార్పును తెలియజేస్తున్నాయని పరిశీలకులు పేర్కొంటున్నారు.