: డోక్లాం ప్రతిష్టంభన నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలి: చైనా
చైనా తన తీరు మార్చుకోవడం లేదు. చైనా, భారత్, భూటాన్ సరిహద్దులోని డోక్లాంలో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ఆర్మీనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని, లేదంటే యుద్ధం తప్పదంటూ ఇన్ని రోజులూ బీరాలు పలికిన చైనా చివరకు వెనక్కితగ్గి ఇరు సైన్యాలు ఒకే సమయంలో అక్కడినుంచి వెళ్లిపోవాలనే సూచనకు ఒప్పుకున్న విషయం తెలిసిందే. నిన్న డోక్లాం నుంచి చైనా బుల్డోజర్లు, రోడ్డు నిర్మాణ యంత్రాలు కూడా వెనక్కు వెళ్లిపోయాయి. అయినప్పటికీ చైనా తమదే పై చేయి అనేలా ప్రవర్తిస్తోంది. తాజాగా భారత్‌కు మరోసారి హెచ్చరిక చేసింది. డోక్లాం ప్రతిష్టంభన ఘటన నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని వ్యాఖ్యలు చేసింది.
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఓ అధికారి ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ... తమదేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సరిహద్దుల్లో తమ ఆర్మీ గస్తీ నిర్వహిస్తూనే ఉంటుందని అన్నారు. దేశ సరిహద్దుల్లో శాంతిపూరిత వాతావరణం కొనసాగేందుకు తాము కృషిచేస్తూనే ఉంటామని చెప్పుకొచ్చారు. భారత్ అంతర్జాతీయ చట్టాల కనీస సూత్రాలు తెలుసుకోవాలని పేర్కొన్నారు. వచ్చే ఆదివారం చైనాలో జరుగుతున్న బ్రిక్స్ సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావాల్సి ఉన్న నేపథ్యంలో చైనా, భారత్ ఆర్మీ అధికారులు డోక్లాం విషయమై మరోసారి చర్చలు జరిపి ఆర్మీని ఉపసంహరించుకున్నారు.