: ఉత్తర కొరియా సరిహద్దుల్లో బాంబులేస్తున్నాం: దక్షిణ కొరియా సంచలన ప్రకటన
ఉత్తర కొరియా సరిహద్దుల్లో ఎనిమిది బాంబులను వేసి తమ సత్తా చూపించనున్నట్టు దక్షిణ కొరియా సంచలన ప్రకటన చేసింది. నేడు సరిహద్దుల్లో బాంబులు వేసేందుకు దేశాధ్యక్షుడు మూన్ జే ఇన్ ఆదేశాలు జారీ చేశారని తెలిపింది. ఎఫ్ 15కే యుద్ధ విమానాల ద్వారా ఎంపిక చేసిన ప్రాంతాల్లో మార్క్ 84 బాంబులను జారవిడువనున్నామని, వీటి ప్రభావం, తమ దేశ సైనిక శక్తి ఉత్తర కొరియాకు తెలిసొస్తాయని వెల్లడించింది.
కాగా, ఈ తెల్లవారుజామున ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం చేస్తుందన్న విషయం దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ వర్గాలకు ముందుగానే తెలుసునని సమాచారం. ఈ క్షిపణి దూసుకు వస్తుండటాన్ని చూసిన జపాన్, తీవ్ర ఆందోళన చెంది, తమ దేశ ప్రజలను ఇళ్లల్లోకి వెళ్లిపోవాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే క్షిపణి జపాన్ అధీనంలో ఉన్న హోక్కాయ్ మీదుగా ప్రయాణించి పసిఫిక్ మహా సముద్రంలో మూడు భాగాలుగా విడిపోయి పడిపోయింది.