: బాబోయ్ బెంగళూరు... అద్దెల్లో ఢిల్లీ, ముంబైలను దాటేసింది!
ఇండియాలో ఎక్కడ అద్దెలు అత్యధికంగా ఉంటాయి? అన్న ప్రశ్నకు నిన్నటివరకూ ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్, ముంబైలోని బీకేసీ పేర్లు వినపడుతుండేవి. ఇప్పుడు బెంగళూరు ఆ స్థానాన్ని ఆక్రమించేసింది. నగరానికి వస్తున్న ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరుగుతుండగా, బెంగళూరు సీబీడీ ప్రాంతంలో కార్యాలయాల అద్దెలు చుక్కలను తాకాయి. ఢిల్లీ, ముంబైలతో పోలిస్తే, చదరపు అడుగుకు ఇక్కడ మరింత రేటు పలుకుతోంది. 'నైట్ ఫ్రాంక్' అనే సంస్థ ఇటీవల ఓ అధ్యయనం చేసి, బెంగళూరులో వాణిజ్య ప్రాంతాల అద్దెలు మిగతా అన్ని నగరాలనూ దాటేశాయని తేల్చింది. ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో అధ్యయనం చేసిన సంస్థ ఏప్రిల్ - జూన్ మధ్య కాలంలో సగటున 1.2 శాతం అద్దెలు పెరిగాయని పేర్కొంది.
ఇండియాలోని మూడు మెట్రో నగరాల్లో అద్దెల వృద్ధి ప్రపంచ సగటుతో పోలిస్తే చాలా ఎక్కువగా పెరిగిందని నైట్ ఫ్రాంక్ ఇండియా చీఫ్ ఎకానమిస్ట్ సమంతక్ దాస్ వెల్లడించారు. తమ అధ్యయనం ప్రకారం, బెంగళూరు సీబీడీ ప్రాంతం ఇండియాలోనే అత్యధిక అద్దె వసూలు చేస్తున్నదని తెలిపారు. ఢిల్లీలోని అతి ముఖ్య కూడలి కన్నాట్ ప్లేస్ లో 2.2 శాతం మేరకు అద్దెలు పెరిగాయని, ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో 2 శాతం మేరకు అద్దెలు పెరిగాయని, బెంగళూరులో మాత్రం 4 శాతం పెరిగాయని ఆయన అన్నారు. గడచిన త్రైమాసికంలో 5.30 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి డిమాండ్ వచ్చిందని అన్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అద్దెల పెరుగుదలను పరిశీలిస్తే, కంబోడియాలోని ఫానామ్ పెన్హ్ ముందు నిలిచి, మూడు సంవత్సరాల నుంచి ఈ విషయంలో టాపర్ బ్యాంకాక్ ను వెనక్కు నెట్టింది.