: కాకినాడ ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ, బీజేపీ-వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ!
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ శాతం క్రమేపీ పెరుగుతోంది. పోలింగ్ బూత్ ల వద్ద ఓటర్లు బారులుతీరుతున్నారు. ఈ నేపథ్యంలో, 9వ డివిజన్, 14వ డివిజన్ ల దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ-వైసీపీ, టీడీపీ-వైసీపీ నేతల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో, ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
9వ డివిజన్లో బీజేపీ అభ్యర్థి మాలకొండయ్య తన ఇంటికి వచ్చిన బంధువులకు టిఫిన్ల కోసం డబ్బులు ఇస్తుండగా... డబ్బులు పంచుతున్నారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, బీజేపీకి చెందిన పలువురు సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీకి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. దీంతో, అక్కడి వాతావరణం వేడెక్కింది. మరోవైపు, 14వ డివిజన్ లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
38వ డివిజన్ పరిధిలోని ఐడీఎల్ కాలేజీ సమీపంలో ఓ ఇంట్లో మహిళను బయటకు రాకుండా వైసీపీ కార్యకర్తలు బంధించారు. సమాచారం అందుకున్న అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లి, మహిళలను విడిపించారు.