: చైనాపై పైచేయి సాధించిన మోదీ చతురతను అభినందించిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్, ఒమర్ అబ్దుల్లా, సీతారాం ఏచూరి, ఏ రాజా!
భూటాన్ సరిహద్దుల్లోని డోక్లాం వివాదం సద్దుమణిగిన సంగతి తెలిసిందే. భారత్ పై తమదే పై చేయి అని చైనా మీడియా ఢంకా బజాయిస్తున్నప్పటికీ భారత ప్రధాని నరేంద్ర మోదీపై నేతలు ప్రశంసలు కురిపించారు. సరిహద్దు వివాదానికి ముగింపు పలకాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తెలిపారు. ఈ సందర్భంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు సోనియా, మన్మోహన్ అభినందనలు తెలిపారు.
దీనిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ట్విట్టర్ ద్వారా ‘దుందుడుకు చర్యలకు పాల్పడకుండానే చైనాపై భారత్ పైచేయి సాధించింది. ప్రధాని మోదీకి, ఆయన బృందానికి అభినందనలు’ అని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కేంద్ర ప్రభుత్వం డోక్లాం వివాదంలో చూపిన చతురతను అభినందించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తన ట్విట్టర్ ద్వారా ‘డోక్లాం వివాదం సద్దుమణగడాన్ని స్వాగతిస్తున్నాం. పొరుగుదేశాలతో సఖ్యత పెంపెందించుకోవడంపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టాలి’ అని పేర్కొన్నారు.