: భారత్‌లో చైనా మొబైల్స్ కంపెనీలపై ప్రభావం పడింది.. స్వదేశానికి వెళ్తున్న 400 మంది ఉద్యోగులు
భారత్‌పై చైనా కనబరుస్తోన్న తీరుతో ఆ దేశ వస్తువులను బహిష్కరించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇన్నాళ్లూ ఆ దేశ వస్తువులకు భారత్‌లో ఉన్న గిరాకీపై ఏ ప్రభావం పడలేదు. అయితే, తాజాగా డోక్లామ్‌లో ఏర్పడిన ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాపై మనదేశీయుల్లో వ్యతిరేకత పెరిగింది. ఆ దేశ కంపెనీల వస్తువుల విక్రయాలు తగ్గిపోయాయి.
ప్రధానంగా ఒప్పో, వివో కంపెనీల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో ఆ ఇరు కంపెనీల్లో పనిచేస్తోన్న చైనా ఉద్యోగులు దాదాపు 400 మంది తిరిగి తమ దేశానికి వెళ్లిపోతున్నారు. గత 60 రోజులుగా వీటి అమ్మకాలు మరింత తగ్గుముఖం పట్టాయి. తమ దేశ వస్తువులపై భారత్‌లో వస్తున్న వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు చైనా కంపెనీలు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాయి. కానీ అవి కార్యరూపం దాల్చలేదు.
ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల్లో ఆయా మొబైల్ తయారీ కంపెనీల విక్రయాలు తగ్గిపోయాయి. మరోవైపు ఆ దేశ ఉద్యోగుల వీసా గడువు కూడా ముగుస్తోంది. దీంతో తమ దేశానికి వెళ్లిపోవడమే బెటర్ అనుకుని ఆ కంపెనీలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆయా కంపెనీల ప్రతినిధులు మాత్రం తమ అమ్మకాలేమీ తగ్గిపోలేదని అంటున్నారు.