: హ్యూస్టన్ యూనివర్సిటీలో చిక్కుకుపోయిన 200 మంది భారతీయ విద్యార్థులు... ట్వీట్‌లో వెల్లడించిన సుష్మా స్వరాజ్
హరికేన్ హార్వీ మూలంగా భారీగా కురుస్తున్న వర్షాలతో అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీ జలమయమైంది. మెడ వరకు నీటితో నిండిపోయిన యూనివర్సిటీలో భారతీయ విద్యార్థులు 200 మంది చిక్కుకుపోయారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ తెలియజేశారు. అక్కడి పరిస్థితిని ఆమె వరుస ట్వీట్ల ద్వారా పంచుకున్నారు. వారికి ఆహారం చేరవేసేందుకు తాము ప్రయత్నించామని, ఆహారం చేరవేయడానికి బోట్లను ఉపయోగించడానికి అమెరికా కోస్ట్‌గార్డ్ అందుకు అనుమతి ఇవ్వడం లేదని సుష్మా తెలిపారు.
హ్యూస్టన్ భారత కేన్సులేట్ జనరల్ అనుపమ్ రాయ్ దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. అలాగే షాలిని, నిఖిల్ భాటియా అనే ఇద్దరు భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, ఈ విషయాన్ని వారి బంధువులకు తెలియజేశామని సుష్మా ట్వీట్ చేశారు. హరికేన్ హార్వీ కారణంగా అమెరికాలోని టెక్సాస్, హ్యూస్టన్ నగరాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ రెండు ప్రాంతాల్లో చాలా మంది భారతీయులు నివసిస్తున్నారు.