: ఆర్టీసీ బస్సులో సొంత డబ్బుతో 'వై - ఫై' పెట్టించిన కండక్టర్!
యువ ప్రయాణికులను ఆకర్షించడానికి ఆర్టీసీ బస్సులో వై - ఫై సౌకర్యాన్ని కండక్టర్ తన సొంత డబ్బుతో పెట్టించాడు. అంతేకాకుండా బస్సుకు అన్ని రకాల ఆధునిక హంగులు తీర్చిదిద్దడానికి దాదాపు రూ. 15000 దాక ఆయన ఖర్చుపెట్టాడు. మధురైకి చెందిన మట్టుథావని బస్‌స్టేషన్‌లో జయబాలాజి కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. మధురై మీదుగా రామాంతపురం నుంచి తంజావూర్ వెళ్లే బస్సుకి ఈయన తన సొంత ఖర్చుతో లైటింగ్, స్పీకర్లు, వై-ఫై సౌకర్యాలు పెట్టించాడు.
దీంతో పిల్లలు, పెద్దలు, యువత, మహిళలు ఈ బస్సులో ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని జయబాలాజి తెలిపాడు. `మొదట బస్సులో టీవీ పెట్టించాలనుకున్నా.. కానీ స్మార్ట్‌ఫోన్ల కారణంగా యువత టీవీ కంటే ఇంటర్నెట్‌కే ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. దీంతో రూ. 4,800 ఖర్చు చేసి వై-ఫై పెట్టించాను` అని బాలాజి వివరించాడు. ఆయన చేయించిన మేకోవర్ వల్ల డిపోలోనూ, బస్టాండ్‌లోనూ, రోడ్డు మీద ప్రయాణిస్తున్నపుడు కూడా తమ బస్సు ప్రత్యేకంగా కనిపిస్తోందని, దీంతో ప్రజలు అదే దారిలో వెళ్తున్న మిగతా బస్సులను కాదని తమ బస్సులో ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారని బాలాజి చెప్పాడు.