: సమసిన డోక్లామ్ వివాదం... ఒకేసారి వెనక్కు పోనున్న రెండు దేశాల సైన్యం!
రెండు నెలులుగా భారత్, భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి ఎట్టకేలకు సమసిపోయింది. ఇక్కడ మోహరించిన భారత్, చైనాల సైన్యం ఒకేసారి వెనక్కు మళ్లేలా ద్వైపాక్షిక చర్చల్లో ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కొద్దిసేపటి క్రితం ఓ ప్రకటనలో వెల్లడించింది. చర్చల ద్వారానే సమస్యను పరిష్కరించుకున్నామని పేర్కొంది. ఇక సాధ్యమైనంత త్వరగా సరిహద్దుల్లోని సైన్యాన్ని రెండు దేశాలూ వెనక్కు పిలుచుకోనున్నాయని తెలిపింది. ఈ నెల జూన్ లో డోక్లామ్ ప్రాంతంలో రహదారిని నిర్మించేందుకు చైనా ప్రయత్నించిన వేళ, భారత సైన్యం అడ్డుకున్న సంగతి తెలిసిందే.
కాగా, చైనా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధమవుతున్న వేళ, ఈ వివాదం సమసిపోవడం గమనార్హం. బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ చైనాకు వెళ్లనున్నారన్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే చైనా, భారత్ లు తమ సైన్యాలను వెనక్కు తీసుకుంటున్నాయని సమాచారం. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది. ఇక నేడే మొత్తం సైన్యం వెనక్కు వస్తుందా? లేక దశలవారీగా వస్తుందా? అన్న విషయమై విదేశాంగ శాఖ స్పష్టత ఇవ్వలేదు. రెండు దేశాలూ ఒకేసారి సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని ఆదినుంచి డిమాండ్ చేస్తున్న భారత్, తన పంతాన్ని నెగ్గించుకోవడం విశేషం.