: త్వరపడండి.. ఆధార్-పాన్ లింకింగ్ గడువు పెంచే ఉద్దేశం లేదన్న కేంద్రం.. 31తో ఆఖరు!
పాన్‌కార్డును ఆధార్‌తో అనుసంధానం చేసుకునే గడువును మరోమారు పొడిగించే అవకాశం లేదని కేంద్రం తేల్చి చెప్పింది. ఈనెల 31లోగా తప్పనిసరిగా అందరూ పాన్‌కార్డుతో ఆధార్‌ను అనుసంధానం చేసుకోవాల్సిందేనని పేర్కొంది. ఈ నెల మొదట్లో ప్రభుత్వం ఆధార్ లింకింగ్ గడువును ఆగస్టు 31 వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఆధార్, పాన్ అనుసంధానం పూర్తయ్యే వరకు రిటర్న్ దాఖలు చేయడం సాధ్యం కాదని హెచ్చరించింది. ఇప్పటికే కావాల్సినంత సమయం ఇచ్చామని, ఇక పొడిగించే ఉద్దేశం లేదని ఆదాయపన్ను శాఖ తెలిపింది.
పాన్-ఆధార్ అనుసంధానం విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు పలువురు పన్ను చెల్లింపుదారులు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఇటీవల ఆధార్ లింకింగ్ విషయంలో సుప్రీం కోర్టు కేంద్రానికి మొట్టికాయలు వేసింది. వ్యక్తిగత గోప్యత ప్రజల ప్రాథమిక హక్కని తేల్చి చెప్పింది. దీంతో ఆధార్ అనుసంధానంపై డైలమా ఏర్పడింది. కోర్టు తీర్పు నేపథ్యంలో చాలామంది ఆధార్ లింకింగ్‌ను లైట్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా ప్రకటన చేయడం గమనార్హం.