: పళనిస్వామి భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్న విద్యాసాగర్ రావు
తమిళనాట రాజకీయాలు మరోసారి కీలక పరిణామానికి చేరుకున్న వేళ, పళనిస్వామి సర్కారు భవితవ్యంపై నేడు లేదా రేపు ఇన్ చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే దినకరన్ వర్గానికి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు తాము పళని ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదని గవర్నర్ కు లేఖలు ఇచ్చిన నేపథ్యంలో, విపక్ష డీఎంకే అధినేత స్టాలిన్, తక్షణం బల నిరూపణకు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
చెన్నైలోనే మకాం వేసిన విద్యాసాగర్ రావును నేడు స్టాలిన్ స్వయంగా కలిసి ఇదే విషయమై మరోసారి తన డిమాండ్ ను ఆయన ముందుంచనున్నారు. ఆపై రాజ్యాంగ నిబంధనల ప్రకారం విద్యాసాగర్ రావు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అంతకన్నా ముందుగా మరోసారి దినకరన్ వర్గ ఎమ్మెల్యేలతో విద్యాసాగర్ చర్చిస్తారని తెలుస్తోంది. ఆ తరువాతనే ఎడప్పాడిని బల పరీక్షకు నిలబడాలని ఆయన ఆదేశిస్తారని సమాచారం. ఇదిలావుండగా, తక్షణం తమ లేఖలపై నిర్ణయం తీసుకోకుంటే, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని దినకరన్ వర్గం నేత తంగతమిళ్ సెల్వన్ హెచ్చరించారు.